లైడిటెక్టర్ పరీక్షకు వెళ్దామా.. కేటీఆర్ సవాల్
గ్లోబరీనా ఆరోపణలపై స్పష్టత
Indiabreakingdaily.com – ల డ ట క టర పర క – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్లోబరీనా సంస్థతో తమకు ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని, 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ వివాదంలో లైడిటెక్టర్ పరీక్షకు వెళ్దామని కూడా సవాల్ విసిరారు.
గురువారం వరంగల్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు పంపినట్లు తెలిపారు.
గ్లోబరీనా నా బినామీ సంస్థ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలే. దీనిపై ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు పంపిన. గడువులోగా క్షమాపణలు చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తా. ఇద్దరం లైడిటెక్టర్ పరీక్షలకు వెళ్దాం
కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
గ్రేటర్ వరంగల్లో పర్యటించిన కేటీఆర్ హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్లో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు.
అనంతరం హైదరాబాద్లో ప్రకటన విడుదల చేస్తూ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. తాను గ్లోబరీనాకు బినామీనే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు అదే సంస్థతో ఒప్పందం చేసుకుందని నిలదీశారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే నీట్లో అక్రమాలు జరిగాయని, దేశవ్యాప్తంగా విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మేము కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్ మాత్రం ప్రధాని పేరెత్తడానికే వణికిపోతున్నారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ పార్టీలో, రాత్రి బీజేపీలో ఉంటున్నారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆయన కాంగ్రెస్ వాళ్లతో కాకుండా బీజేపీ ఎంపీల కార్లలో తిరుగుతారని అన్నారు.
రాష్ట్రం నుంచి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఒక్క మూట పంపితే బీజేపీ పెద్దలకు రెండు మూటలు పంపిస్తున్నాడని ఆరోపించారు. తన పాత కేసులు ఎక్కడ బయటకు తీస్తారోనని ప్రధాని మోదీకి సీఎం భయపడ్తున్నాడన్నారు.
బీజేపీ-బీఆర్ఎస్ సంబంధాలు
బీజేపీ తెలంగాణలో పవర్లోకి రావడానికి స్ట్రాంగ్ అవుతోందనే ప్రచారం ఉత్తమాటే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వారికి చెప్పుకోదగ్గ నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తమను ఓడించిన స్టూడెంట్లు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని వణికిస్తున్నారన్నారు.
ప్రధాని మోదీ ఫస్ట్ టైమ్ షేక్ అవుతున్నాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
దళితబంధు మరియు ఇతర అంశాలు
దళితబంధు అద్భుతమైన పథకమని, కానీ ఆ పథకం రానివాళ్లలో వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అందరికి అందుబాటులో ఉన్నా కూడా ‘సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేగా మాకే అందుబాటులో ఉండట్లేదు’ అని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 చోట్ల అభ్యర్థులను మారిస్తే అందులో 10 మంది విజయం సాధించారని, పలు స్థానాల్లో అభ్యర్థులను మారిస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో తాము కేసీఆర్ను పూర్తిస్థాయిలో కన్విన్స్ చేయడంలో ఫెయిలైనట్లు చెప్పారు.
హరీష్ రావు పార్టీ మారుతాడనే ప్రచారం ఉట్టిదేనని, ఈ అంశంలో 25 ఏండ్లుగా అతనికి శీలపరీక్ష తప్పట్లేదన్నారు. హీరోయిన్లతో ఎఫైర్ ఉందని, వారి ఫోన్లను ట్యాప్ చేశాడంటూ తనపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు.
తనకు సీఎం కావాలనే ఆలోచనే లేదని, రాబోయే రోజుల్లో కేసీఆర్ను తిరిగి సీఎం చేయడమే తమ ఎజెండా అని కేటీఆర్ అన్నారు.




