IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

భూ సర్వే అక్రమాలు: చేయి తడిపితేనే ల్యాండ్సర్వే .. రైతులకు లంచం తిప్పలు.. ఎకరానికి రూ.10 వేలకుపైగా సర్వేయర్ల డిమాండ్

Published June 7, 2026 · Updated June 7, 2026 · By Robert Anderson

భ సర వ అక రమ ల - కరీంనగర్, వెలుగు : వ్యవసాయ భూముల సర్వే కోసం అప్లికేషన్‌‌‌‌ పెట్టుకున్న రైతులకు ‘లంచం’ తిప్పలు తప్పడం లేదు. తాము అడిగినంత చేతిలో పడితేగానీ సర్వేయర్లు భూముల్లో అడుగు పెట్టడం లేదు. మినిమం ఎకరానికి రూ. 10 వేలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఎకరాలు, సర్వే నంబర్ల సంఖ్య పెరిగే కొద్దీ వారి ‘డిమాండ్‌‌‌‌’ మరింత పెరుగుతోంది. డబ్బులు ఇవ్వకపోతే భూముల హద్దులు తప్పుగా చూపిస్తారేమోనన్న భయంతో దరఖాస్తుదారులు సర్వేయర్లు అడిగినంత వారికి ముట్టజెపుతున్నారు.

ప్రభుత్వం కేటాయించిన లైసెన్స్‌‌‌‌డ్ సర్వేయర్లను.. మండల సర్వేయర్లు తమ అసిస్టెంట్లుగా, వసూళ్లలో మధ్యవర్తులుగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఏసీబీ దాడులు జరిగిన టైంలో మండల సర్వేయర్‌‌‌‌తో పాటు లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ సర్వేయర్లు కూడా చిక్కుతున్నారు.

భూవివాదాలు పరిష్కరించుకోవడానికి, గెట్లు పక్కాగా పెట్టుకోవడానికి రైతులు ‘మీసేవ’లో చార్జీ చెల్లించి సర్వే కోసం అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం జీతం తీసుకునే మండల సర్వేయర్‌‌‌‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వ్యవసాయ భూమిని సర్వే చేయాలంటే రూ.10 వేలు ఇవ్వనిదే సర్వేయర్‌‌‌‌ భూమి మీదికి రావడం లేదు.

జిల్లా కేంద్రంలోని సర్వే అండ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్ ఆఫీసుకు వెళ్లి ఒరిజినల్ టిప్పన్‌‌‌‌ (భూమి నకలు పటం) తేవాలని, కొలతలకు వచ్చినప్పుడు తనకు, తన అసిస్టెంట్లకు భోజనాలు, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఖర్చుల పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందు కొంత డబ్బు తీసుకొని సర్వే పూర్తి చేసినా.. మిగతా డబ్బులు ఇచ్చిన తర్వాతే పంచనామా రిపోర్ట్‌‌‌‌ ఇస్తున్నారు.

సర్వేయర్లు అడిగినంత ఇవ్వకపోతే తమ భూమి హద్దులను తప్పుగా చూపిస్తారేమోనని, రికార్డులను మార్చేసి పక్క రైతులకు మేలు చేస్తారేమోనని దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే టెక్నికల్‌‌‌‌ సమస్యలు ఉన్నాయని, పక్క భూమి యజమానులు రాలేదని, మండల ఆఫీసులో రికార్డులు సరిగా లేవంటూ నెలల తరబడి పెండింగ్‌‌‌‌లో పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు.

రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు సుమారు 12,500 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన ప్రభుత్వం వారికి మూడు నెలలు క్లాసులు, మరో మూడు నెలలు ఫీల్డ్ ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చింది. ఆ తర్వాత వీరికి ఎగ్జామ్ నిర్వహించి 6,500 మందిని సెలక్ట్‌‌‌‌ చేసి మండలాలకు కేటాయించారు. భూభారతిలో మ్యాప్‌‌‌‌తో కూడిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాక.. వీరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం పైలట్‌‌‌‌ దశలోనే ఉన్న ఈ తరహా రిజిస్ట్రేషన్లు కొన్ని మండలాలకే పరిమితం కావడంతో కొత్తగా వచ్చిన లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ సర్వేయర్లలో చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. వీరిలో మండలానికి ఇద్దరు, ముగ్గురిని మండల సర్వేయర్లు తమ వెంట సర్వేకు తీసుకెళ్తున్నారు. తమ వసూళ్లకు మధ్యవర్తులుగా వాడుకుంటున్నారు.

వ్యవసాయ భూముల సర్వేకు డబ్బులు డిమాండ్ చేస్తున్న సర్వేయర్లు.. పలుచోట్ల ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మన్‌‌‌‌గుర్తిలో మూడు ఎకరాల భూమిని సర్వే చేసేందుకు రైతు నుంచి రూ.25 వేలు డిమాండ్ చేసిన సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. కుమారస్వామి కొత్తగా వచ్చిన ఇద్దరు లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ సర్వేయర్లను మధ్యవర్తులుగా పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది.